స్మృతి మంధానపై ఎలీసీ పెర్రీ ప్రశంసలు..

కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపై (Smriti Mandhana) ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఎలీసీ పెర్రీ (Ellyse Perry) ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల క్రికెట్‌లో మంధాన ప్రత్యేక గుర్తింపు పొందడానికి ఆమె బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు అసాధారణమైన మానసిక బలం కూడా ప్రధాన కారణమని పెర్రీ అభిప్రాయపడ్డారు. మంధానకు అద్భుతమైన ప్రతిభ, అత్యున్నత స్థాయి నైపుణ్యం ఉన్నాయని పేర్కొన్న పెర్రీ.. ఆమె సంకల్పం, క్రమశిక్షణ, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెడతాయని అన్నారు. మ్యాచ్‌లకు సిద్ధమయ్యే విధానంలోనూ మంధాన ప్రత్యేకత కనిపిస్తుందని తెలిపారు. తన బలాలు, బలహీనతలను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడం ఆమె గొప్ప లక్షణమని కొనియాడారు.

ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మంధాన, బ్యాటింగ్‌తో పాటు నాయకత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం ఆమెకు ఉందని క్రికెట్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఇటీవల జరిగిన ది హండ్రెడ్ 2026 టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మంధాన ఏడు ఇన్నింగ్స్‌లలో 232 పరుగులు సాధించారు. ఆమె స్ట్రైక్‌రేట్ 140కు చేరువగా ఉండటం విశేషం.

మరోవైపు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఎలీసీ పెర్రీ ఏడు మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేసి 55.75 సగటుతో ఆకట్టుకున్నారు. అయితే ఈ టోర్నీలో ఇద్దరు స్టార్ క్రికెటర్ల జట్లు టైటిల్‌ను అందుకోలేకపోయాయి. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ లీగ్ దశలోనే నిష్క్రమించగా, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ టైటిల్‌కు చేరువగా వెళ్లి వెనుదిరిగింది. స్మృతి మంధాన బ్యాటింగ్ నైపుణ్యం, ఒత్తిడిని తట్టుకునే మానసిక ధైర్యం, సవాళ్లను స్వీకరించే తత్వం ఆమెను ప్రపంచ మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా నిలబెట్టాయని ఎలీసీ పెర్రీ పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో మంధాన ప్రభావం రోజురోజుకు మరింత పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>