కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లాలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన దేవుని కరుణ కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. వర్షాలు వస్తాయని నమ్మకంతో అప్పులు తెచ్చి విత్తనాలు జల్లి, వర్షాలు కురవకపోవడంతో మధ్యలోనే పంటను కొందరు రైతులు వదిలివేశారు. బావులు, కెనాల్ కాలువలు, కుంటల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మరికొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెచ్చిన డబ్బులను అప్పులు తీర్చలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం (Duggondi Mandal) వెంకటాపురం గ్రామం లో ఓ మహిళా రైతు తన పొలంలో ఏర్పాటు చేసిన ఫెక్లీ అందరిని ఆకర్షిస్తోంది.
ఈ సంవత్సరం అప్పు తెచ్చి పంట వేస్తే వర్షాలు కురవక, కాలువలో కూడా నీరు వదలక పంట ఎండిపోయిందని ఆవేదన చెందుతూ లక్ష్మి అనే మహిళా రైతు ఈ ఫెక్లీ ఏర్పాటు చేసింది. పంట కోసం అప్పులు చేశామని, బ్యాంకు లోన్ కట్టే పరిస్థితిలో లేమని ఫెక్లీ ద్వారా వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. ”రేవంత్ అన్న మా రైతులను ఆదుకోండి” అంటూ ఫెక్లీ ద్వారా కోరింది. రైతుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

