కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో అత్యంత వేడుకగా జరిగే గణేష్ ఉత్సవాలకు (Ganesh Festival) జీహెచ్ఎంసీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 14న వినాయక చవితి కాగా, 25వ తేదీన నిమజ్జన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కమిషనర్ ఆర్వీ.కర్ణన్ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 13వ తేదీ నాటికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో..
గణేష్ ఉత్సవాల సందర్భంగా విధుల్లో పాల్గొనే అన్ని శాఖల అధికారులపై సమన్వయం చేసుకోవాలని కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశించారు. మరీ ముఖ్యంగా ఇటీవల జీహెచ్ఎంసీలోకి కొత్తగా చేరిన సర్కిళ్లలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లకు సూచించారు. గణేష్ విగ్రహాలు ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలా మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అందుకు సంబంధించి ఇప్పటి నుంచి స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
బాలాపూర్ గణేష్ కోసం..
నగరంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ గణేష్ వద్ద ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టాలని కమిషనర్ ఆర్వీ.కర్ణన్ సూచించారు. ఉత్సవ కమిటీ, పోలీస్, విద్యుత్ విభాగాలతో సమావేశం కావాలని సంబంధిత జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు, క్రేన్లు తెప్పించుకోవడం సహా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ వద్ద మరో కంట్రోల్ రూం కూడా ఉంటుందన్నారు.

