మణుగూరులో గ్యాంగ్ వార్.. యువకుడి హత్య

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పట్టణంలో గ్యాంగ్ వార్ ఘటన, ఘర్షణలో ఓ యువకుడు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. బాంబే కాలనీకి చెందిన సింహాద్రి శివ (28) వద్ద పనిచేస్తున్న ఓ వర్కర్‌కు, మరో వర్గం మధ్య వివాదం చోటు చేసుకుంది. మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందామంటూ శివను మణుగూరులోని స్టోర్ గ్రౌండ్‌కు పిలిపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత మాటామాట పెరిగడంతో ప్రత్యర్థులు శివపై విచక్షణరహితంగా దాడికి తెగబడి హత్య చేశారు. ఛాతీ భాగంలో పిడిగుద్దులు కురిపించడంతో శివ తీవ్రంగా గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంకే గ్యాంగ్ పనేనా..?

శివపై “ఎంకే గ్యాంగ్” అని పిలిచే వ్యక్తులే దాడి చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివను పథకం ప్రకారం అక్కడికి పిలిపించి దాడికి పాల్పడ్డారా.. అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. శివను పిలిపించింది ఎవరు, ఎంత మంది దాడిలో పాల్గొన్నారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఎంకే గ్యాంగ్’ ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ప్రత్యక్ష సాక్షుల విచారణ అనంతరం నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

మరోవైపు, ​28 ఏళ్ల వయసులోనే శివ మరణించడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ప్రశాంతంగా ఉండే మణుగూరు పట్టణంలో కొందరు వ్యక్తులు ఇలా గ్యాంగులుగా ఏర్పడి.. ప్రాణాలు తీసే స్థాయికి తెగబడటంపై స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని.. పట్టణంలో గ్యాంగ్ సంస్కృతి విస్తరించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>