డీకే అరుణ పై విమర్శలు చేస్తే సహించేది లేదు : రామాంజనేయులు

కలాం, జోగులాంబ గద్వాల: కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని, ఎంపీ డీకే అరుణ పై చిల్లర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ గద్వాల (Gadwal BJP) జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హెచ్చరించారు. సోమవారం గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

సొంత గ్రామంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి.. ఎంపీ డీకే అరుణను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సొంత నాయకులే ఆయనను ప్రెసిడెంట్‌గా గుర్తించడం లేదని, కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు ప్రవర్తిస్తూ రాష్ట్ర నాయకులకు ఊడిగం చేసి అధ్యక్షుడు అయ్యాడని ఆయన మండిపడ్డారు. గద్వాలలో ఆయనను ఎవరూ గుర్తుపట్టే పరిస్థితి లేదని, కేవలం తన స్థాయిని పెంచుకోవడానికే ఎంపీ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

గద్వాల పట్టణంలో నేడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా గతంలో అప్పటి మంత్రి గా ఉన్న డీకే అరుణ హయాంలో జరిగిందేనని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల పార్టీ అని మండిపడుతూ… గతంలో 2G స్కామ్, బొగ్గు కుంభకోణం, ఏషియన్ కుంభకోణం, హవాలా కుంభకోణాలతో పాటు సంక్షేమ పథకాల పేరుతో దేశాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని ధ్వజమెత్తారు.

70 ఏళ్ల పాలనలో ముస్లిం సంక్షేమం పేరుతో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని, ముస్లిం సమాజాన్ని కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ఆరోపించారు. బీజేపీ మాత్రం అన్ని మతాలకు అతీతంగా, “భారతదేశమే ఒక కుటుంబం” అనే భావనతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

అలాగే, అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణంలో కోట్లాది మంది భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. ​ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాలిమ్ ఇసాక్, మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మల్లెందొడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>