మూసీ నీటిని సాగుకు మళ్లించాలి : చిరుమర్తి లింగయ్య

కలం, నకిరేకల్ : మూసీ ప్రాజెక్టులో (Musi Project) నిల్వ ఉన్న నీటిని వృథాగా దిగువకు వదలకుండా వెంటనే నిలిపివేసి, ఎండిపోతున్న రైతుల పంటలను కాపాడాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు వద్ద నీటి విడుదలపై రైతులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై పూర్తి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రైతులకు పంటల సమయంలో సాగునీరు అందించడంలో అధికారులు ఆరు నెలలుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలు నీరందక దెబ్బతింటుంటే, అధికారులు మాత్రం ప్రాజెక్టులోని నీటిని వృథాగా దిగువకు వదిలేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. “గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల పంట అవసరాలను బట్టి అధికారులతో సమీక్షించి, సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకునేవారం.

ప్రస్తుతం పంట కోతల సమయం వచ్చినప్పటికీ నీటిని సమర్థవంతంగా వినియోగించకుండా వృథా చేస్తున్నారు.” అని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. పంటలకు నీరు అవసరమైన సమయంలో ఇవ్వకుండా, ప్రస్తుతం నీటిని వృథాగా వదులుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వృథాగా పోతున్న నీటిని నిలిపివేసి పంటలకు మళ్లించాలని రైతులు విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి మూసీ నీటిని సమర్థవంతంగా వినియోగించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>