లంక ప్రీమియర్ లీగ్ లో కలకలం.. మంజోత్ కల్రా అరెస్ట్!

కలం, స్పోర్ట్స్​ : లంక ప్రీమియర్ లీగ్ (LPL) ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద కలకలం రేగింది. లీగ్‌లో ఒక ఆటగాడికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై భారత మాజీ అండర్-19 వరల్డ్ కప్ హీరో మంజోత్ కల్రా (Manjot Kalra) ను శ్రీలంక క్రీడా అవినీతి నిరోధక విభాగం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఫైనల్లో సెంచరీతో చెలరేగి జట్టుకు కప్ అందించిన ఆటగాడు ఈ మంజోత్ కల్రా. క్రికెట్ కెరీర్ తర్వాత స్పోర్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన కల్రా (Manjot Kalra), ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్‌లో ‘జాఫ్నా కింగ్స్’ ఫ్రాంచైజీకి కో-ఓనర్‌గా మారాడు.

అయితే ఈ టోర్నీలో భాగంగా ఒక ఆటగాడికి డబ్బు ఆఫర్ చేశారనే ఆరోపణలు మంజోత్ కల్రాపై వచ్చాయి. జాఫ్నా కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంక క్రికెటర్లు భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు లంచం ఇవ్వజూపినట్లు వారు దాదాపు పది రోజుల క్రితమే అధికారులకు సమాచారం అందించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిపిన స్పోర్ట్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పోలీసులు శుక్రవారం కల్రాను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మంజోత్ కల్రా అరెస్ట్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందిస్తూ, అవినీతిపై తాము ఎప్పుడూ కఠినంగా ఉంటామని స్పష్టం చేసింది.

దర్యాప్తు సంస్థలకు తాము పూర్తి సహకారం అందిస్తామని, అయితే ఈ వివాదం కారణంగా టోర్నమెంట్‌కు ఎలాంటి అభ్యంతరం ఉండదని బోర్డు తెలిపింది. లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసుపై అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>