కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం (Ashwapuram) మండలం మనుబోతులగూడెంలో శుక్రవారం నాడు అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం తీవ్ర కలకలం రేపింది. పొట్టకూటి కోసం వ్యవసాయ పనులు చేసుకుంటున్న గిరిజన మహిళలపై ఫారెస్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు, ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ దాడి ఘటనలో పలువురు గిరిజన మహిళలకు గాయాలైనట్లు సమాచారం. అమాయక అడవి బిడ్డలపై అధికారులకు ఎందుకు అంత చిన్నచూపు అని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత గిరిజనుల కథనం ప్రకారం, తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో శుక్రవారం వ్యవసాయ పనులు నిర్వహిస్తుండగా అటవీ శాఖ సిబ్బంది వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గిరిజనుల నిరసనను లెక్కచేయకుండా ఫారెస్ట్ సిబ్బంది మహిళలపై చేయి చేసుకున్నారని, అమానుషంగా దాడికి దిగారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో మనుబోతులగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవేళ వివాదం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, గిరిజన మహిళలపై చేయి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద ఎత్తున గిరిజనులు ఆందోళన చెందుతున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటన అటవీ శాఖ అధికారుల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపుతోందని స్థానికులు మండిపడుతున్నారు. రథం గుట్ట సమీపంలో సుమారు 5 హెక్టార్ల భూమిలో భారీ డోజర్లతో చెట్లను యథేచ్ఛగా తొలగించిన ఘటనపై ఇంతవరకు అటవీ శాఖ నుంచి ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించలేదని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు.
అక్కడ అంత పెద్ద ఎత్తున అడవి ధ్వంసమవుతుంటే మౌనం వహించిన అధికారులు, ఇక్కడ తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న అమాయక గిరిజనులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రథం గుట్టలో అడవిని కొట్టేసిన వారిని వదిలేసి, గిరిజనులపై ప్రతాపం చూపడం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రథం గుట్ట సమీపంలో జరిగిన చెట్ల తొలగింపు ఘటనపై అధికారుల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని, అలాగే మనుబోతులగూడెం ఘటనపై వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని స్థానికులు, గిరిజన సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రెండు అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ గురించి నిరంతరం మాట్లాడే జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి ప్రజలకు నిజాలు వెల్లడించాలని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

