కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ (Urea App)పై రైతుల ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. యాప్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోర్తాడ్ మండలంలో యూరియా యాప్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు చేపట్టారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గేట్ నేషనల్ హైవే 63 పై మూడు గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
దొన్కల్, షెట్ పల్లి, ధర్మోరా గ్రామాల నుంచి రైతులు భారీ సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు. యూరియా యాప్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియాను రైతులకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాప్ రద్దు చేసి అన్నీ సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. పెంచిన ఎరువు ధరలను తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుపై రైతులు రెండు గంటలపాటు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

