కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తాజాగా తుఫాన్‌గా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ కు అర్నబ్ (Cyclone Arnab) తుపానుగా వాతావరణ శాఖ నామకరణం చేసింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపింది. విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టం చేశారు. ఒడిశా వైపు వెళ్లాల్సిన తుఫాన్ అనూహ్యంగా.. పశ్చిమ దిశగా కదులుతూ ఏపీ వైపు దూసుకొస్తోందని పేర్కొంది.
రానున్న కొద్ది గంటల్లో ఈ తుపాను మరింత బలపడే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం అర్ధరాత్రి ‘తీవ్ర తుఫాన్ గా పరివర్తన చెందే అవకాశం కనిపిస్తోంది. అలాగే మంగళవారం నాటికి ‘అతి తీవ్ర తుపాను’గా రూపాంతరం చెందే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉదయం ఏపీలోని బాపట్ల విశాఖపట్నం మధ్య, యానాంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్ర తుఫాన్ గా మారనున్న నేపథ్యంలో ప్రజలు మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఈ రోజుల్లో 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స కారులు వేటకు వెళ్లోద్దని సూచిస్తున్నారు.
తుఫాన్ కారణంగా ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉండటంతో మంగళవారం గోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే అనకాపల్లి, విశాఖ జిల్లాలకూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తు సమయంలో సహాయం అందించించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.

