కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ 2026 షూటింగ్ పోటీల్లో హైదరాబాద్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ ఈషా సింగ్ (Esha Singh) అద్భుత పోరాట పటిమ కనబరిచి రజత పతకం గెలుచుకుంది. సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఈషా చివరి వరకు పట్టువదలకుండా పోరాడింది. చైనా అథ్లెట్ షియావో జియారుయిక్సువాన్‌తో జరిగిన హోరాహోరీ టై-బ్రేకర్ మ్యాచ్‌లో అతి స్వల్ప తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుని రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ ఫైనల్ మ్యాచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసింది. పతకం కోసం ఈషా (Esha Singh) ఏకంగా ఐదు సూపర్ షూట్-ఆఫ్‌లలో పాల్గొనాల్సి వచ్చింది. నిర్ణీత రౌండ్లు పూర్తయ్యేసరికి ఇద్దరూ 38 పాయింట్లతో సమంగా నిలవడంతో విజేతను తేల్చడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరి షాట్‌లో ఈషా చిన్న పొరపాటు చేయడంతో చైనా షూటర్ పసిడి సొంతం చేసుకోగా, ఈషా వెండి పతకంతో మెరిసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈషా మాట్లాడుతూ.. ఇది తన కెరీర్‌లోనే అత్యంత సుదీర్ఘమైన, ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అని, చివర్లో తన చేతులు కూడా తీవ్రంగా నొప్పులు పెట్టాయని వెల్లడించింది.
అంతకుముందు జరిగిన పిస్టల్ టీమ్ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. అనుభవజ్ఞురాలైన షూటర్ రహి సర్నోబత్ నాలుగో సిరీస్‌లో వేసిన ఒక షాట్ నేరుగా టార్గెట్‌ను తప్పడంతో జీరో (0) పాయింట్లు నమోదయ్యాయి. తన కెరీర్‌లో ఇలాంటి విచిత్రమైన పొరపాటు ఎప్పుడూ జరగలేదని, ఇది ఎలా జరిగిందో తనకే అర్థం కావడం లేదని రహి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఈ ఒక్క పొరపాటు వల్ల భారత జట్టు 1727 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమై పతకానికి దూరమైంది. టీమ్ విభాగంలో పతకం చేజారినా, వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ చూపించిన ఆత్మవిశ్వాసం, పోరాటం క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక స్టార్ షూటర్ మను భాకర్ 11వ స్థానంలో నిలిచి ఫైనల్ అర్హత సాధించలేకపోయింది.

