కలం, వెబ్ డెస్క్ : రాజకీయ నాయకులు అంటే స్వార్థం మాత్రమే అనే నానుడి మరోసారి రుజువైంది. ‘ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న’ అన్న చందంగా జరిగిన ఘటన తీవ్ర విమర్శలు దారి తీసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ (Alampur Municipal Elections) మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నాయకులు కొందరు ఓటు వేయడానికి వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఓటు వేసిన తర్వాత మాత్రం ఆమెను పట్టించుకోకుండా వదిలేశారు.
తీవ్రమైన ఎండలో దిక్కుతోచకుండా, గందరగోళంలో కూర్చున్న ఆమె దీనస్థితిని గమనించిన అలంపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ప్రదీప్ కుమార్ తక్షణమే స్పందించారు. తన అధికారిక పోలీసు వాహనంలోనే ఆ వృద్ధురాలిని సురక్షితంగా ఇంటి దాకా చేరవేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాయకుల తీరుపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో సీఐ ప్రదీప్ కుమార్ మానవత్వం, ఆయన స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


