కలం, స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ వేళ ఇండియన్ క్రికెట్‌లో కొత్త వివాదం రాజుకుంది. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కి ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పంచాల్ (Priyank Panchal) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీహార్ తరఫున వైభవ్ ఇప్పటివరకు కేవలం 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 113 మ్యాచ్‌ల అనుభవం ఉన్న అభిమన్యు ఈశ్వరన్ లాంటి సీనియర్లను పక్కనపెట్టి వైభవ్‌కు ఈ బాధ్యత ఇచ్చారు.
జింబాబ్వే పర్యటనలో T20 మ్యాచ్‌ల్లో వైభవ్ 151 రన్లు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే సెలెక్టర్లు అతడికి ఇషాన్ కిషన్ డిప్యూటీగా ప్రమోషన్ ఇచ్చారు. అయితే పంచాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చిన్న పిల్లాడిపై అనవసర ఒత్తిడి పెంచడం సరైంది కాదన్నారు. ముందుగా అతడిని రెడ్ బాల్ క్రికెట్‌ను అర్థం చేసుకోనివ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలపై ఈస్ట్ జోన్ సెలెక్టర్ మనీష్ వర్ధన్ స్పందించారు.
ఇది భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. కెప్టెన్‌ను దగ్గరగా గమనించడం వల్ల వైభవ్ ఆటతీరు మెరుగవుతుందని చెప్పారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 23వ తేదీ నుంచి దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ప్రారంభం కానుంది. తొలి రౌండ్‌లో ఈస్ట్ జోన్.. నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడనుంది. ఆగస్టు 30వ తేదీన సెమీఫైనల్స్, సెప్టెంబర్ 5వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి.

