epaper
Monday, February 23, 2026
epaper

దుబాయ్‌లో ఎగిరే టాక్సీలు.. 10 నిమిషాల్లోనే 36 కిలోమీటర్ల ప్రయాణం

కలం, వెబ్ డెస్క్: దుబాయ్ (Dubai) తన ఖ్యాతిని మరింత పెంచుకుంటూ ఈ ఏడాది చివరి నాటికి ‘ఎయిర్ టాక్సీ’ (గాలిలో ప్రయాణించే టాక్సీలు) సేవలను ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ఈ విప్లవాత్మక రవాణా సౌకర్యం ద్వారా రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి పట్టే సమయం భారీగా తగ్గనుంది. ఉదాహరణకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరా మధ్య ఉన్న 36 కిలోమీటర్ల దూరాన్ని ఈ ఎయిర్ టాక్సీ కేవలం 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఇదే దూరాన్ని కారులో చేరుకోవడానికి ట్రాఫిక్ కారణంగా దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది.

దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అమెరికాకు చెందిన ‘జోబీ ఏవియేషన్’ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ఎయిర్ టాక్సీ (Air Taxi)లు పూర్తిగా విద్యుత్‌తో నడుస్తాయి (eVTOL). దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకేసారి పైలట్‌తో‌పాటు నలుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించేలా వీటిని రూపొందించారు. హెలికాప్టర్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ శబ్దంతో ప్రయాణించడం విశేషం.

ఈ సేవల కోసం దుబాయ్‌లో ప్రత్యేకంగా నాలుగు ‘వర్టిపోర్ట్స్’ (Vertiports – ఎయిర్ టాక్సీలు దిగడానికి, ఎగరడానికి ఉపయోగపడే ప్రాంతాలు) నిర్మిస్తున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరా వంటి కీలక ప్రాంతాల్లో ఈ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వినూత్న రవాణా వ్యవస్థ ద్వారా దుబాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య ఎయిర్ టాక్సీ నెట్‌వర్క్‌ను కలిగిన నగరంగా చరిత్ర సృష్టించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>