Mobile Popup Ad
Mobile Popup Ad

వీడిన మిర్యాలగూడ త్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ.. విచారణలో షాకింగ్ నిజాలు

కలం, మిర్యాలగూడ: మిర్యాలగూడలో (Miryalaguda) కలాల్‌వాడలో ఈ నెల 4న జరిగిన అగ్నిప్రమాద ఘటనను నల్లగొండ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించినా.. పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా దర్యాప్తులో తేలింది. ముగ్గురి ప్రాణాలను బలిగొన్న నిందితుడిని సాంకేతిక ఆధారాల సహాయంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ (38) అనే పాత నేరస్థుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడికి తెలుగు మ్యాట్రిమోనీ వంటి వివాహ వెబ్‌సైట్ల ద్వారా అమాయక మహిళలను టార్గెట్ చేయడం అలవాటు. పెళ్లి పేరుతో నమ్మించి, వారి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొంది మోసం చేయడంలో ఇతడు సిద్ధహస్తుడు.

ఇదే క్రమంలో బాధితురాలు ధనలక్ష్మిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. నిందితుడి ప్రవర్తన నచ్చకపోవడంతో కాలక్రమేణా ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది. గతంలో హాజీపూర్‌లో మహిళను మోసం చేసిన కేసులో శిరీష్ కుమార్ జైలుకు వెళ్లాడు. భార్య ధనలక్ష్మి తనకు బెయిల్ కోసం కూడా ప్రయత్నించలేదనే కక్షను పెంచుకున్నాడు. ఎలాగైనా ధనలక్ష్మిని, ఆమె పిల్లలను అంతమొందించాలని స్కెచ్ వేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మిర్యాలగూడకు (Miryalaguda) వచ్చి పరిసరాలను పరిశీలించాడు. సంఘటన రోజు ఉదయం ఒక యాక్టివా స్కూటీని దొంగిలించి, మార్గమధ్యలో క్యాన్ కొని పెట్రోల్ నింపుకున్నాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి, నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ చల్లి అగ్గిపుల్ల గీశాడు. ఈ మంటలు ప్రమాదవశాత్తు జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ధనలక్ష్మి ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో తప్పించుకోగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తల్లి వనం చంద్రమ్మ, కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

క్లూస్ టీం, సీసీటీవీ ఆధారంగా..

ఘటనా స్థలంలో పెట్రోల్ బకెట్, నిందితుడు వదిలివెళ్లిన చెప్పులు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీసీఆర్‌బీ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితుడి కదలికలను గుర్తించి బేడీలు వేశారు. ఈ ఉదంతంపై ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ వివాహ వేదికల (మ్యాట్రిమోనీ) ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవతలి వ్యక్తుల పూర్తి నేపథ్యం, కుటుంబ వివరాలు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే ముందడుగు వేయాలని కోరారు. ఈ త్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన డీసీఆర్‌బీ డీఎస్పీ జి. రవి, మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణరావు, ప్రొబేషనరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్‌లు జి. రాజారాం, నల్లగంతుల శ్రీనులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలతో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>