కలం, వెబ్ డెస్క్ : భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరగబోయిన ఒక పూర్తి స్థాయి యుద్ధాన్ని తనే స్వయంగా అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్‌లో జరిగిన ఒక అధికారిక సమావేశంలో మాట్లాడిన ఆయన, గతంలో ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న సైనిక ఘర్షణల్లో దాదాపు 11 విమానాలు కూలిపోయాయని పేర్కొన్నారు.
ఆ సమయంలో ఘర్షణలను ఇలాగే కొనసాగిస్తే భారత్, పాకిస్థాన్ రెండు దేశాలపై 250 శాతం భారీ టారిఫ్ విధిస్తానని తాను హెచ్చరించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ఆర్థికపరమైన హెచ్చరికల తర్వాతే ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆ ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత పాకిస్థాన్ ప్రధానమంత్రి తనకు స్వయంగా ఫోన్ చేసి, “మీరు తీసుకున్న చొరవతో 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారు” అని కృతజ్ఞతలు తెలిపినట్లు ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అయితే, కాశ్మీర్ లేదా ఇతర ద్వైపాక్షిక అంశాలపై ట్రంప్ గతంలో చేసిన మధ్యవర్తిత్వ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు తీవ్రంగా ఖండించింది. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ అనేది ఇరు దేశాల సైనికాధికారుల (DGMO) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు, అంతర్గత అవగాహన ద్వారానే సాధ్యమైందని ఢిల్లీ స్పష్టం చేసింది. ఈ శాంతి ప్రక్రియలో ఎలాంటి మూడో దేశం జోక్యం లేదా మధ్యవర్తిత్వం లేదని, ఇది పూర్తిగా దౌత్యపరమైన ద్వైపాక్షిక నిర్ణయమని భారత్ తేల్చి చెప్పింది.

