జ్ఞానమే వికసిత్ భారత్‌కు పునాది: ప్రొఫెసర్ అలోని

కలం, నాగార్జునసాగర్: మనం చేసే కర్మలు జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఉండాలని ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ అలోని(Professor Aloni) అన్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా బుద్ధుడు తొలి ఉపన్యాసం ఇచ్చిన రోజును పురస్కరించుకుని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో (Buddhavanam) బుధవారం ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవాన్ని (Dhammacakka Pavattana Day) ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా బుద్ధ చరిత వనంలోని బుద్ధ పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహా స్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించి, మహాబోధి బుద్ధ విహార బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు  నిర్వహించారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులకు చీవరాలను అందజేశారు.

అనంతరం బుద్ధవనం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ అలోని మాట్లాడుతూ, విద్య సరైన దిశలో సాగకపోతే సమ్యక్ సమాజ నిర్మాణం సాధ్యం కాదన్నారు. విద్య సమ్యక్ మార్గంలో ఉంటే సమాజం కూడా సరైన దిశలో పయనిస్తుందని, తద్వారా అందరికీ జ్ఞానం అందుతుందని తెలిపారు.  బుద్ధవనం అద్భుతమైన ప్రదేశమని, స్వాతంత్రం అనంతరం బుద్ధుని శాంతి సందేశాన్ని, జీవిత చరిత్రను ఒకే చోట అందరికీ అర్థమయ్యేలా నిర్మించిన గొప్ప ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని అన్నారు. సిద్ధార్థుడు వైశాఖ పౌర్ణమి రోజున జన్మించడం, అదే రోజున మహాభినిష్క్రమణ, అనంతరం మహాపరినిర్వాణం పొందడం విశేషమని పేర్కొన్నారు. జ్ఞానోదయం పొందిన అనంతరం సమస్త జీవుల హితం, సుఖం కోసం బుద్ధుడు తన జ్ఞానాన్ని మొదటగా పూర్వ శిష్యులైన కొండన్న, మహానామ, వప్ప, అప్పాజీ, బద్దియాలకు అందించిన ప్రవచనమే తొలి ధర్మచక్ర ప్రవర్తనగా ప్రసిద్ధి చెందిందని అన్నారు.

బుద్ధుడు మొదట జ్ఞానాన్ని బోధించిన సారనాథ్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం గర్వించదగిన విషయమని తెలిపారు. మన కర్మలు సమాజాన్ని జ్ఞానం వైపు నడిపించేలా ఉండాలని, అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని అన్నారు. 2500 ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు తన తొలి ప్రవచనంలో ధర్మ మార్గాన్ని, మంచి కర్మల ప్రాధాన్యతను బోధించారని చెప్పారు. పాలకులు ధర్మ పాలన చేయాలని, దీనికి అశోకుడు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచ నాగరికతలకు బుద్ధ ధర్మం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అనంతరం బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ధర్మ చక్ర ప్రవర్తన ప్రాముఖ్యతను, బుద్ధుని అష్టాంగ మార్గాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాం సుందర్ రావు, డీఈ శ్రీనివాస్ రెడ్డి, సాగర్ డ్యాం భద్రత అధికారి శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ కేశవ్ అజ్మీర, బౌద్ధాభిమానులు, బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>