Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ సర్కారు నిర్ణయం

కలం, వెబ్ డెస్క్: విద్యుత్ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భారీ శుభవార్త చెప్పారు. వారికి 1.621 శాతం మేర డీఏ పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విద్యుత్ సౌధ‌లోని జెన్ కో ప్ర‌ధాన కార్యాల‌యంలో బుధవారం ఇంధ‌న శాఖ అధికారుల స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శాఖలోని 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచే తాజాగా పెంచిన డీఏ అమలులోకి వచ్చే ప్రతిపాదనకు డిప్యూటీ సీఎం ప‌చ్చ జెండా ఊపారు. తాజా పెంపుతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి చేరిన‌ట్లయింది. ప్ర‌భుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.

గరిష్ఠ స్థాయికి విద్యుత్ డిమాండ్..

విద్యుత్ రంగ పనితీరుపైనా ఉప ముఖ్య‌మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. వర్షాకాలంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు స‌న్న‌ద్ధం కావాలని చెప్పారు. రానున్న ప‌దేళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ రంగ సంస్థ‌ల్లో మౌలిక సదుపాయాల కోసం పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఎండాకాలంలో రికార్డు స్థాయిలో గరిష్ఠ డిమాండ్ ఎదురైనా స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు లేకుండా చూసిన అధికారులు, సిబ్బందిని ప్ర‌త్యేకంగా అభినందించారు. మార్చి 27న పీక్ డిమాండ్ 18,548 మెగావాట్లకు చేరినా.. స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం లేదన్నారు. మార్చి 13న అత్యధికంగా 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగిందన్నారు. రాష్ట్రంలో 2035-36 నాటికి పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. 2035-36 నాటికి వార్షిక విద్యుత్ అవసరాలు 1,52,626 మిలియన్ యూనిట్లకు (MU) చేరుకుంటుందని డిప్యూటీ సీఎం విశ్లేషించారు.

మూడు సంస్థలు సమన్వయంతో..

వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్ కో సంస్థలు అత్యంత సంసిద్ధంగా, సమన్వయంతో ఉండాల‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారుల‌కు సూచించారు. ప్ర‌ధానంగా క్షేత్రస్థాయి అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఎక్కడైనా సరఫరాకు అంతరాయం ఏర్పడితే, తక్షణమే రంగంలోకి దిగి లోపాలను సరిచేయాలన్నారు. ప్రమాదాలను నివారించడానికి ముందస్తు జాగ్రత్త చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగ‌రేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వ‌రుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్, ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ట్రాన్స్ కో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లతా వినోద్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>