కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని షాదరా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఒక నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం తెల్లవారుజామున 3:48 గంటల సమయంలో ఫైర్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 14 అగ్నిమాపక యంత్రాల సాయంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఉదయం 6:25 గంటల కల్లా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ భవనంలో ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also: చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?
Follow Us On: WhatsApp

