కలం, వెబ్ డెస్క్ : దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతున్న వారిపై జరిగిన లాఠీఛార్జ్ను ఖండిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury ) ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నిరసన కారులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. మోదీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారిపోయాయని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని మండిపడ్డారు. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న కూడా ప్రధాని మోదీ తన మొద్దు నిద్రను వీడడం లేదని ఆగ్రహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదని, ప్రధాని మోదీతో పాటు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, అంతకుముందు పార్లమెంట్ బయట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదురుపడటంతో, ఆయన ముఖం ముందే రేణుకా చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం ఏంటి? ఇది ఒక ‘యూస్లెస్ గవర్నమెంట్’ అని విమర్శలు గుప్పించారు. అయితే రేణుకా చౌదరి విమర్శలు చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆమె వ్యాఖ్యలను పట్టించుకోనట్లుగా ఫోన్ చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనార్హం.

