కలం, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లికి వందనం (Thalliki Vandanam) స్కీమ్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. ఇటీవల ప్రభుత్వం తల్లికి వందనం నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్నూలులో కొందరు కేటుగాళ్లు పలువురు మహిళల అకౌంట్లలో డబ్బులు మాయం చేశారు. దాదాపు 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయమైనట్లు గుర్తించి బ్యాంకులో అధికారులను సంప్రదించారు.
ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్ పర్సన్స్ ఈ స్కామ్‌కు పాల్పడినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సిమ్‌లు అమ్మేటప్పుడు బాధితుల ఆధారాలు సేకరించి, బాధితుల వేలిముద్రలు, అకౌంట్ డీటెయిల్స్‌తో నగదు దోచుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉపేంద్ర, వీరారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితులకు మళ్లీ నగదు అందేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

