బ్యాంకింగ్ దిగ్గజాలకు హ్యాకర్ల షాక్: కస్టమర్ల డేటా లీక్!

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఆర్థిక సేవల దిగ్గజాలు వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard), జేపీ మోర్గాన్ (JPMorgan) సంస్థలపై సైబర్ దాడులు (Cyber Attack) కలకలం రేపుతున్నాయి. ఈ సంస్థలకు సేవలు అందించే థర్డ్ పార్టీ వెండార్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకోవడంతో లక్షలాది మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తెలుస్తోంది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమకు సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడి జరిగినట్లు వీసా సంస్థ అధికారికంగా ధృవీకరించింది. అయితే, ఈ దాడి వల్ల తమ ప్రధాన చెల్లింపుల వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, కస్టమర్ల ఆర్థిక లావాదేవీలు సురక్షితంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.

డేటా లీక్ వ్యవహారంపై మాస్టర్‌కార్డ్ కూడా స్పందించింది. హ్యాకర్ల దాడి కారణంగా కొంతమంది కస్టమర్ల ఈమెయిల్ ఐడీలు, ఇంటి చిరునామాలు బహిర్గతమైనట్లు సంస్థ అంగీకరించింది. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, డేటా లీక్ వల్ల ప్రభావితమైన బాధిత కస్టమర్లకు అవసరమైన అన్ని రకాల భద్రతాపరమైన సహాయ సహకారాలు అందిస్తామని మాస్టర్‌కార్డ్ భరోసా ఇచ్చింది.

అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ సైతం ఇదే తరహా సైబర్ దాడికి గురైనట్లు వెల్లడించింది. తమకు సాంకేతిక సేవలు అందించే ఒక థర్డ్ పార్టీ వెండార్ వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడి, కొంత డేటాను తస్కరించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నామని జేపీ మోర్గాన్ పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>