కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం (Dummugudem Mandal)తూరుబాక సమీపంలోని గోదావరి నది తీరంలో ఆదివారం తీవ్ర కలకలం రేగింది. నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ స్థానిక వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. రోజూలాగే చేపలు పట్టేందుకు సదరు వ్యక్తి గోదావరికి వెళ్లి గాలం వేశాడు. కొంతసేపటి తర్వాత గాలానికి ఏదో బరువైన జంతువు లేదా పెద్ద చేప చిక్కినట్లు అనిపించడంతో, సంతోషంతో గాలాన్ని పైకి లాగాడు.
అయితే, నీటి పైకి వచ్చిన దాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. గాలానికి చేపకు బదులుగా చిన్నపాటి మొసలి పిల్ల చిక్కుకుని ఉంది. పెద్ద చేప పడిందనుకున్న చోట మొసలి కనిపించడంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ఆందోళనతో గాలాన్ని, ఆ మొసలి పిల్లను అక్కడే వదిలేసి ఒడ్డుకు పరుగులు తీశాడు. ఈ విషయాన్ని గ్రామంలోని అందరికీ తెలియజేశాడు.
గోదావరి నదిలో మొసలి పిల్ల కనిపించడంతో, దానికి సంబంధించిన పెద్ద మొసళ్లు కూడా పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండవచ్చనే సమాచారంతో తూరుబాక గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నది వద్దకు వెళ్లే మత్స్యకారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

