బీజేపీ మహా పాదయాత్రపై సిపిఎం ప్రశ్నల వర్షం

కలం, కరీంనగర్: ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పాదయాత్రకు వచ్చే ముందు నగర ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం (Gudikandula Satyam) అన్నారు. నగరంలో గత 20 ఏళ్లుగా డంపింగ్ యార్డ్ ప్రధాన సమస్యగా ఉందని, బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని బండి సంజయ్ (Bandi Sanjay) ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.

కరీంనగర్ పట్టణంలో మరో ప్రధాన సమస్యగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పాదయాత్ర చేస్తున్నామని బీజేపీ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సత్యం వ్యాఖ్యానించారు. మహిళల హక్కులను అణచివేసి, రైతుల నడ్డి విరిచి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువతపై కాల్పులు జరిపి, లాఠీచార్జీలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగానికి తూట్లు పొడిచేదే బీజేపీ పార్టీ అని, అలాంటి పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. గాంధీ రోడ్డు, వైశ్యభవన్, టవర్ సర్కిల్, కమాన్ చౌరస్తా మీదుగా పాదయాత్ర నిర్వహించడం వల్ల చిరు వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ పాదయాత్రతో నగరానికి ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బీజేపీ నగర అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని గుడికందుల సత్యం డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>