కలం, కరీంనగర్ : తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది ప్రాణత్యాగం చేసి, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టులదని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి (Polampalli) గ్రామంలో అమరవీరుడు అనభేరి ప్రభాకర్ రావు (Anabheri Prabhakar Rao) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్రతో పాటు అనభేరి ప్రభాకర్ రావు వంటి వీరుల త్యాగాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు. చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు.
కరీంనగర్ జిల్లా తొలి సిపిఐ కార్యదర్శిగా అనభేరి ప్రభాకర్ రావు 40 గ్రామాలను దత్తత తీసుకుని దొరలు, దేశ్ముఖ్లు, రజాకార్ల అరాచకాల నుంచి ప్రజలను కాపాడారని గుర్తుచేశారు. ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లోకి రజాకార్లు ప్రవేశించేందుకు కూడా భయపడేవారని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా ‘విలీన దినోత్సవం’గా ప్రకటించాలని పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టల శ్రీనివాస్, నాయకులు న్యాలపట్ల రాజు, సూరం మల్లేశం, గ్రామ శాఖ కార్యదర్శులు కాంతాల తిరుపతిరెడ్డి, ముత్త ఎల్ల స్వామి, గూడెపు రమేష్, మర్రి కొమురయ్య, ప్రజానాట్యమండలి కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

