కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో తెల్ల బంగారం తేలిపోయింది. పంట కళ్ల ముందే ఎండిపోతుంటే అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ముందస్తు వర్షాలను నమ్మి విత్తనాలు నాటిన రైతులకు, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా సరిపడా వర్షాలు లేక, మరోవైపు ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరడంతో పత్తి చేన్లు నిలువునా మాడిపోతున్నాయి.
పూత, కాత లేక..
నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తు పెరగాల్సిన పత్తి చేను, భూమిలో తేమ లేక కేవలం ఐదారు ఆకుల దశలోనే ఎదుగుదల కోల్పోయింది. జానెడు ఎత్తులోనే పూత, కాతకు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దశలోని మొక్కలు ఒకటి లేదా రెండు పూతలు, కాయలకు మించి వేసే పరిస్థితి లేదు.
రాబోయే రోజుల్లో వర్షాలు కురిసినా ఎదిగే దశ దాటిపోవడంతో ఇక పంట పుంజుకునే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈసారి 6.00 లక్షల ఎకరాలకు పడిపోయింది. సాగు విస్తీర్ణం దాదాపు 2.5 లక్షల ఎకరాలు తగ్గినా, రైతులకు నష్టాల తీవ్రత మాత్రం తగ్గలేదు.
పెట్టుబడులు మట్టిపాలు..
దుక్కి దున్నడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాల ఖర్చులతో కలిపి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు పత్తి సాగుపై దాదాపు రూ.1,750 కోట్లు ఖర్చు చేశారు. సొంత భూమి కలిగిన రైతులు ఎకరాకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఆ మొత్తం తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎకరాకు రూ.15వేల వరకు కౌలు చెల్లించిన కౌలు రైతులు పెట్టుబడితో కలిపి రూ.40వేల వరకు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోకపోతే మాకు చావే దిక్కు” అని జిల్లాకు చెందిన పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులను ప్రభుత్వం ఎకరాకు పరిహారం అందించి తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

