కలం, కరీంనగర్: పీజీ సీటు రాలేదని డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ పోలీసుల వివరాల ప్రకారం… తీగలగుట్టపల్లి (Theegalaguttapally)లోని న్యూ సరస్వతీ నగర్‌కు చెందిన పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గత నాలుగేళ్లుగా ధర్మారం మండలం నందిమేడారం, చొప్పదండి మండలం కటికనపల్లి పీహెచ్‌సీల్లో కాంట్రాక్ట్ వైద్యుడిగా సేవలందించారు.
పీజీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గాను నెల రోజుల కిందటే ఉద్యోగానికి గౌతమ్ రాజీనామా చేశారు. గతంలో రెండు సార్లు పీజీ ప్రవేశ పరీక్షలు రాసినా.. మెరిట్ మార్కులు రాకపోవడంతో సీటు దక్కలేదు. దీంతో గౌతమ్ కొంతకాలంగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడి బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు.
ఉన్నత చదువులు చదివినా..
తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో తల్లి లేచి చూసేసరికి గౌతమ్ తన గదిలో ఉరివేసుకొని కనిపించారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు గౌతమ్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి రాజమొగిలి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమొగిలి నీటిపారుదల శాఖలో విశ్రాంతి ఉద్యోగి. గౌతమ్ సోదరుడు బ్యాంక్ మేనేజర్, సోదరి జగిత్యాలలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

