కలం, కరీంనగర్ బ్యూరో: స్నేహితుడి కోసం గంజాయి తెప్పించి, ఓ వ్యక్తిపై అక్రమ కేసు పెట్టేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్‌ను కరీంనగర్ (Karimnagar) పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌కి చెందిన మెడబోయిన నాగరాజు ఈగల్ టీంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
భూ తగాదా పరిష్కారం కావడం లేదని..
చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌కు కానిస్టేబుల్ నాగరాజుతో పరిచయం ఉంది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో శ్రీనివాస్‌కు భూతగాదాలున్నాయి. ఎన్నిసార్లు పంచాయతీ నిర్వహించినా కొలిక్కి రాకపోవడంతో శ్రీనివాస్ రెడ్డిని కేసులో ఇరికించాలని శ్రీనివాస్ కుట్ర పన్నారు. ఇందుకు కానిస్టేబుల్ నాగరాజు సాయం కోరగా అంగీకరించారు. స్నేహితుడి కోసం కానిస్టేబుల్ నాగరాజు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి శ్రీనివాస్ రెడ్డి ఎరువుల దుకాణంలో పెట్టారు.
పక్కా సమాచారంతో సోదాలు..
అనంతరం, నాగరాజు పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్ రెడ్డిపై చిరుమామిడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యేలా చేసి జైలు పాలు చేశారు. వరంగల్ నుంచి తెప్పించిన గంజాయిలో కిలో గంజాయి శ్రీనివాస్ రెడ్డి దగ్గర దొరికినట్లు చూపించగా, మిగిలిన 370 గ్రాముల గంజాయిని ఇంట్లో పెట్టుకున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు నాగరాజు ఇంట్లో సోదాలు నిర్వహించి గంజాయి, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ చేస్తామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కొత్తపల్లి సీఐ కోటేశ్వర్ పాల్గొన్నారు.

