రహానేకు విక్రాంత్ మాస్సీ ఎమోషనల్ ట్రిబ్యూట్

కలం, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్ అజింక్య రహానేకు (Ajinkya Rahane) బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సీ (Vikrant Massey) భావోద్వేగ నివాళి అర్పించారు. రాహుల్ ద్రవిడ్‌కు నిజమైన వారసుడు రహానేనే అంటూ ప్రశంసించారు. రహానే రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే విక్రాంత్ మాస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేక పోస్టు చేశారు. కొందరు ఆటగాళ్లు రికార్డులను వదిలి వెళ్తారని, మరికొందరు కొత్త ప్రమాణాలను నెలకొల్పి వెళ్తారని పేర్కొన్నారు. రహానే మాత్రం ఎప్పుడూ వ్యక్తిగత విజయాల కంటే జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని తెలిపారు. విజయాలను వినయంగా స్వీకరించడం, పరాజయాలను గౌరవంగా ఎదుర్కోవడం రహానే ప్రత్యేకత అని విక్రాంత్ అన్నారు. ప్రతిభతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా ఎంత ముఖ్యమో రహానే తన కెరీర్ ద్వారా నిరూపించారని కొనియాడారు.

“రాహుల్ ద్రవిడ్‌కు నిజమైన వారసుడు అజింక్య రహానే. ఎలాంటి హంగామా లేకుండా తన ఆటతోనే ప్రతిభను నిరూపించుకున్నాడు. భారత క్రికెట్‌కు ఆయన చేసిన నిస్వార్థ సేవ, పట్టుదల, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని విక్రాంత్ పేర్కొన్నారు. ఇటీవల రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్న ఆయన.. తన ప్రయాణంలో అభిమానులు, సహచరులు అందించిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. 2011లో ఇంగ్లండ్ పర్యటనలో వన్డేలలో అరంగేట్రం చేసిన రహానే.. 2013లో టెస్టు క్రికెట్‌లోకి ప్రవేశించారు. భారత జట్టు తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడారు.

ఐపీఎల్‌లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన రహానే 212 మ్యాచ్‌లు ఆడారు. 2020-21లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి చారిత్రక సిరీస్ విజయాన్ని అందించారు. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా భారత జట్టుకు ఆడిన రహానే.. తన ప్రశాంతమైన ఆటతీరు, నాయకత్వ లక్షణాలతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>