కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ చెప్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఎక్స్ వేదికగా విషెస్ చెప్తూ ఓ పోస్టు చేశారు. రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంపై, ఇక్కడి ప్రజలపై ఎంతో చిత్తశుద్ధిని, నిబద్ధతను చాటుకున్నారని కొనియాడారు. రాజకీయ అనుబంధానికి అతీతంగా రాహుల్ గాంధీ తనకు ఒక అన్నలా నిలిచారని, ప్రతి సవాలులోనూ తనకు అండగా ఉంటూ ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని సీఎం భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యుడిగా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అంకితభావం, మెరుగైన భవిష్యత్తు కోసం ఆయనకున్న దార్శనికత దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి భగవంతుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని, ఆయన ఎంచుకున్న మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాహుల్‌కు విషెస్ చెప్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాహుల్ గాంధీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనునిత్యం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ చెప్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రాహుల్ గాంధీ తన సుదీర్ఘ ప్రజా జీవితంలో యువత, రైతులు, మహిళలు, సమాజంలోని నిరుపేదలు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. అందరినీ కలుపుకుపోయే తత్వం, భారతదేశ మూల సూత్రాలపై ఉన్న అచంచలమైన నమ్మకమే ఆయన రాజకీయాలను నడిపిస్తున్నాయని డీకే శివకుమార్ పేర్కొన్నారు. రాహుల్‌తో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, చర్చలను గుర్తు చేసుకుంటూ.. ప్రజలకు సేవ చేయడం, రాజ్యాంగ విలువలను రక్షించడంలో ఆయనతో కలిసి నడవడం ఒక గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

