కలం, కరీంనగర్ బ్యూరో: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను మరోసారి 29 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ (Ananthula Ramesh) డిమాండ్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని చెబుతూనే మరోవైపు గ్యాస్ ధరలను పెంచడం కేంద్రం అవలంబిస్తున్న ద్వంద వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యమైన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే డీజిల్, పెట్రోల్, వాణిజ్య సిలిండర్ల ధర పెంపుతో నిత్యవసర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం, హార్మూజ్ జలసంధిలో అంతరాయాలు సాకుగా చూపుతూ ధరలు పెంచడం సమర్ధనీయం కాదన్నారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకొని సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

