కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో (Karimnagar Congress) అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బ్లాక్, మండల, డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల నియామకం, బూత్ లెవెల్ ఏజెంట్ల ఎంపికపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే రెండు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ తోపులాటకు దిగారు.
ఈ వివాదానికి ప్రధాన కారణంగా కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపు నిలిచింది. టికెట్ల పంపిణీలో పారదర్శకత పాటించలేదని, అర్హులైన వారికి అన్యాయం జరిగిందని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. పార్టీ క్రమశిక్షణను పాటించాలని, అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యే జోక్యంతో గొడవ తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ, ఈ విభేదాలు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశమూ ఉందని చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, అలాగే ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బ్లాక్, మండల, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On : WhatsApp

