కలం, భువనగిరి: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ (Bhuvanagiri Collectorate) ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ఓటు హక్కును కాపాడటంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సర్ ప్రక్రియ పేరుతో అర్హత కలిగిన అనేకమంది నిరుపేదలు, పౌరుల ఓట్లను జాబితా నుండి అక్రమంగా తొలగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతీ అర్హత కలిగిన పౌరుడి ఓటును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఓటర్ల జాబితాలను అత్యంత పారదర్శకంగా రూపొందించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆందోళనలను కొనసాగిస్తామని నాయకులు హెచ్చరించారు.
అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఎసీఎస్ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

