కలం, వరంగల్: అర్హులైన ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకన్న(Commissioner Venkanna) కోరారు. ఈ నెల 23వ తేదీ నుంచి అన్ని డివిజన్లలోని నమోదు కేంద్రాల్లో ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. శనివారం ఉర్సు కరీమాబాద్ 40వ డివిజన్‌లోని నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న తెల్ల రేషన్ కార్డుదారులు ఈ పథకానికి అర్హులని, ఒక్కో కుటుంబంలో ఒకరికి మాత్రమే రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు.
అర్హులు ఆధార్, రేషన్ కార్డులతో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను సమర్పించి నమోదు చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని కమిషనర్ తెలిపారు. నమోదు ప్రక్రియలో అర్హులెవరూ మిగిలిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

