కలం, ఆదిలాబాద్: జిల్లాలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రజలందరూ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) పిలుపునిచ్చారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో శంకర నేత్రాలయ హైదరాబాద్, వనవాసీ కళ్యాణ్ పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్సల ప్రత్యేక వైద్య శిబిరాన్ని (Free Eye Treatment Camp) ఆయన ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, పిఓ వైద్యులు రోగులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే వ్యవసాయం, చదువులు, వ్యాపారాలు అన్ని రంగాలలో రాణించవచ్చని తెలిపారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కేవలం తీవ్రమైన అనారోగ్య సమయాల్లో లేదా చివరి దశలో మాత్రమే ఆర్ఎంపీల వద్దకు వెళ్లే ధోరణిని మార్చుకోవాలని, ప్రాథమిక దశలోనే అర్హులైన ప్రభుత్వ వైద్యులను లేదా నిపుణులను కలవాలని స్పష్టం చేశారు.
ఈ ఉచిత వైద్య శిబిరం(Free Eye Treatment Camp)లో అక్టోబర్ 31 వరకు కంటి పరీక్షలు నిర్వహించి, నవంబర్ 1 వరకు కంటి ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కేవలం కంటి పరీక్షలు, ఆపరేషన్లే కాకుండా, అవసరమైన వారికి తదుపరి ఫాలో-అప్ సేవలు సైతం పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఇటువంటి సద్వినియోగ శిబిరాలు ఎంతో ప్రయోజనకరమని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Also Read : ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నది ముఖ్యం: టీపీసీసీ చీఫ్
Follow Us On : WhatsApp

