కలం, ఆదిలాబాద్ : జిల్లాలోని రైతులకు సోయాబీన్ అమ్మకాల్లో(Soybean Procurement) ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోయాబీన్ పంట కొనుగోలు, సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతుల సౌకర్యార్థం 10 కొనుగోలు కేంద్రాలను త్వరలోనే ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, జైనథ్, బేల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ (హస్నాపూర్), ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రైతులు తమ పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కేంద్రాల వద్దకు వచ్చే రైతుల కోసం తాగునీరు, నీడ తదితర మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంట తూకంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన నగదును సత్వరమే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ కుమార్, కేంద్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ రవికుమార్, ఏవో టెక్నికల్ విశ్వామిత్ర తదితరులు పాల్గొన్నారు.

