కలం, హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Chahat Bajpai) పిలుపునిచ్చారు. ప్రకృతి వనరులను కాపాడుతూ పర్యావరణహితంగా పండుగ వేడుకలను నిర్వహించాలని కోరారు. ఆదివారం హనుమకొండ మున్సిపల్ గెస్ట్‌హౌస్ సమీపంలో శివకుమార్ నిర్వహిస్తున్న మట్టి గణపతి విగ్రహాల స్టాల్‌ను కలెక్టర్ సందర్శించారు.
చెరువు మట్టితో సహజసిద్ధంగా తయారు చేసిన విగ్రహాలను పరిశీలించి, వాటి తయారీ విధానం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు. అనంతరం మట్టి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ గత 12 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. విగ్రహాలను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు.
పర్యావరణహిత విగ్రహాలతో ప్రయోజనాలు
మట్టి విగ్రహాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించవచ్చని కలెక్టర్ తెలిపారు. మట్టి విగ్రహాల నిమజ్జనం సులువుగా జరుగుతుందని, అనంతరం లభించే మట్టిని చెట్లకు, పొలాలకు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని, వాటి ప్రాముఖ్యతపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు.

