కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాజకీయంలో తమదైన ముద్ర వేస్తూ రాబోయే స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన (Janasena) పార్టీ ప్రజాక్షేత్రంలో స్పీడ్ పెంచింది. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘జనసేన తెలంగాణ శంఖారావం’ సభ వేదికగా పార్టీ నేతలు భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో క్షేత్రస్థాయి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
వచ్చే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోని మొత్తం 60 డివిజన్లలో అభ్యర్థులను నిలుపుతామని, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని జనసేన నేత గడల శ్రీనివాస్ ప్రకటించారు. జనసేన మద్దతు లేకుండా ఖమ్మంలో మేయర్ ఎన్నిక సాధ్యం కాదని స్పష్టం చేసిన ఆయన, కార్యకర్తలపై దాడులు చేసినా లేదా అక్రమ కేసులు బనాయించినా బెదిరేది లేదని హెచ్చరించారు.
ఇదే వేదికపై జనసేన నాయకుడు రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ఓటును రూ. 2 వేలు లేదా మద్యం ప్యాకెట్ల కోసం అమ్ముకోవద్దని, నిబద్ధత కలిగిన కొత్త నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని, అలాగే బీసీ సామాజిక వర్గానికి తగిన భాగస్వామ్యం, గిరిజన ప్రాంతాలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు హైదరాబాద్‌లోని తుక్కుగూడ ఆసుపత్రి ఆవరణలో దారుణ హత్యకు గురైన 21 ఏళ్ల ఆదివాసీ నర్సు శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పార్టీ నాయకుడు, నటుడు తనిష్ స్పష్టం చేశారు. ఈ ఘోర ఘటనపై మహిళా మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నిందితులతో పాటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

