కలం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడంటూ భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 10వ తేదీన నాగర్ కర్నూల్ పట్టణంలో హోటల్ యజమాని మహమ్మద్ కరీం (43) తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైనట్లు కొల్లాపూర్‌లో ఉండే అతడి తమ్ముడు ఎండీ హుస్సేన్‌కు సమాచారం అందింది. అనంతరం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు కరీం భార్య సలీమా బేగంను విచారించారు.
నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్ పాషా అనే వ్యక్తితో సలీమాకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకుని కరీం భార్యను పలుమార్లు మందలించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. రెండు నెలల కిందట పెద్ద మనుషులు మరోసారి గౌస్‌ను తీవ్రంగా హెచ్చరించడంతో “ఎప్పటికైనా నేను నిన్ను చంపేస్తా” అంటూ కరీంను గౌస్ బెదిరించాడు. అదే రోజు కత్తి కొని ఇంట్లో దాచి పెట్టుకున్నాడు.
ఆస్తి కొట్టేయాలని హత్యకు కుట్ర..
కరీంను అంతమొందిస్తే.. ఆయన ఆస్తి తమకు దక్కుతుందని సలీమా, గౌస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న సలీమా నెల్లూరు దర్గాకు వెళ్లినట్లు వాట్సప్ కాల్ ద్వారా గౌస్‌కు సమాచారం ఇచ్చింది. ఇంట్లో కరీం ఒంటరిగా ఉంటాడని చెప్పడంతో, అతడిని చంపేందుకు ఇదే మంచి సమయమని గౌస్ భావించాడు. ఈ క్రమంలోనే 9న రాత్రి కరీంను చంపుతానని సలీమాకు వాట్సప్ కాల్ చేసి గౌస్ చెప్పాడు.
అదే రోజు అర్ధరాత్రి ముందే సిద్ధం చేసుకున్న కత్తి, గ్లౌజులు, ఒక జత బట్టలు తీసుకుని నాగర్ కర్నూల్ పట్టణంలోని కరీం ఇంటికి వెళ్లి డోర్ తట్టాడు. నిద్రమత్తులో కరీం తలుపు తీయగానే కత్తితో కరీం గొంతు కోసి గౌస్ అక్కడి నుంచి పారిపోయాడు. మార్గమధ్యలో చెట్ల పొదల్లో కత్తి, చెప్పులు, బట్టలు, గ్లౌజులు పడేసి తన సొంతూరికి వెళ్లిపోయాడు.
నేరం ఒప్పుకోవడంతో..
హత్య అనంతరం పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సలీమాను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయాన్ని అంగీకరిచింది. ఆమె వాంగ్మూలం మేరకు గౌస్ పాషాను అదుపులోకి తీసుకోగా.. కరీంను తానే చంపినట్లు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి, సిబ్బంది వెంకటేష్, భీముడు, రమేష్‌ను డీఎస్పీ అభినందించారు.

