మహబూబ్‌నగర్‌లో నిమజ్జన కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta), జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) అధికారులను ఆదేశించారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని పలు చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్న కృత్రిమ బేబీ పాండ్‌ను, పెద్ద విగ్రహాల నిమజ్జనానికి అనువైన చెరువులను శుక్రవారం కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా క్రిస్టియన్ పల్లి పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కృత్రిమ బేబీ పాండ్‌తో పాటు పాలకొండ చెరువు, శ్రీనివాస్ కాలనీ చెరువు, అప్పన్నపల్లి చెరువు, చిన్నదర్పల్లి చెరువులను పరిశీలించి, నిమజ్జన ఏర్పాట్లపై మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్పనపల్లి చెరువు వద్ద ఎక్కువ వినాయక విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున, అక్కడ రెండు పెద్ద బేబీ పాండ్లను నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

చిన్న, మధ్య తరహా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో బేబీ పాండ్‌లను ఏర్పాటు చేయాలని, వాటిలో తగినంత నీరు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.

నిమజ్జన కేంద్రాల వద్ద విద్యుత్ దీపాలు, బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు, తాగునీరు, ప్రవేశం–నిష్క్రమణ మార్గాలు తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం అనంతరం విగ్రహాల అవశేషాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

బేబీ పాండ్‌ల వద్ద నిరంతరం పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, నీటి నాణ్యతను పర్యవేక్షించాలని తెలిపారు. నిమజ్జనం పూర్తయిన అనంతరం పాండ్లను శుభ్రపరిచి, అవసరమైన మేరకు నీటిని తొలగించి, ఆయా ప్రాంతాలను యథావిధిగా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

బేబీ పాండ్లు, నిమజ్జన కేంద్రాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసేలా మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు తమ సమీపంలోని నిర్దేశిత నిమజ్జన కేంద్రాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

పెద్ద విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన నీటి లభ్యతను పరిశీలించి, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చే పెద్ద విగ్రహాల నిమజ్జనానికి బీచుపల్లి వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై గద్వాల జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని కలెక్టర్ వెల్లడించారు.

నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసు, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీలు సూచించారు. నిమజ్జన కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.

నిమజ్జన కేంద్రాలకు విగ్రహాలను తీసుకువచ్చే వాహనాలకు అనుకూలంగా ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు, నిమజ్జనం అనంతరం తిరిగి వెళ్లే మార్గాలను ముందుగానే సిద్ధం చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు శాఖతో సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం పాతపల్లి పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ను, దాని ప్రక్కనే ఉన్న శిల్పారామాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా సందర్శించారు. పెద్ద చెరువులో జరుగుతున్న పనులు, వాటి పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శిల్పారామంలోని స్టాళ్ల కేటాయింపుల వివరాలను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా వీహెచ్‌‌పీ అధ్యక్షులు యాది రెడ్డి, ప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>