కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ (Indalwai Eklavya School)ను మరింతగా మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతి గృహాల నిర్వహణ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా వాటిని కప్పిపుచ్చకుండా వాస్తవ పరిస్థితులను తన దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి, వాటికి తక్షణ పరిష్కారం చూపే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పాఠశాలలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధి, మరమ్మతు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందేలా పాఠశాల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భోజన పదార్థాల నాణ్యతను ప్రతిరోజూ పరిశీలించాలని ఆదేశించారు.
విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు..
అనారోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
పాఠశాల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు బాధ్యతతో పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

