కలం, వెబ్ డెస్క్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి రూ.9 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తున్నారని, అయితే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు చెరువులు, కుంటల అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు కూడా ఇవ్వడం లేదని తాజా జరిగిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు . మునుగోడుకు నిధులు అడిగినందుకు తనను “పండబెట్టి తొక్కుతా” అంటూ సీఎం వ్యాఖ్యానిస్తున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం ఏంటి? అని నిలదీశారు.
అయితే తాను తొక్కించుకునే రకం కాదని, అధికారం ఉందని ఏం చేసినా నడుస్తుందనుకుంటే కుదురదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ”బిడ్డా రేవంత్.. ఖబర్దార్.. మీ భాష ఇలానే ఉంటే యుద్ధం మొదలవుతుంది” అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర, హుజూర్నగర్ మాత్రమే కాదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కొందరి నియోజకవర్గాలకే నిధులు పరిమితమవుతున్నాయని, డిండి ఎత్తపోతల పథకం, చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రి వంటి హామీలు ఏమి అయ్యాయని ప్రశ్నించారు.
ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారని, ఇంకో రెండేళ్లు మాత్రమే రేవంత్ పదవిలో ఉంటారని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. మూడేళ్ల పాలన తర్వాత ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తుచేశారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, అందుకే బహిరంగంగా ప్రశ్నించాల్సి వస్తోందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

