కలం, మెదక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిద్దిపేట పర్యటన సందర్భంగా నిర్వహించిన పాదయాత్రలో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. జనాన్ని నియంత్రించడంలో పోలీసులు విఫలం కావడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట పట్టణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదటగా ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం చౌరస్తా నుంచి బహిరంగ సభా స్థలి వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీఎం రేవంత్ పాదయాత్ర చేపట్టారు. సీఎం పాదయాత్ర సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పోలీస్ వలయాన్ని దాటి లోపలికి చొచ్చుకొచ్చారు. సీఎం వద్దకు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఒక దశలో గుంపులు గుంపులుగా జనం ఒక్కసారిగా తోసుకురావడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయ పరిస్థితి నెలకొంది.
కిందపడిన మైనంపల్లి..
పాదయాత్ర తోపులాటలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పోలీసు అధికారులు అదుపుతప్పి కిందపడ్డారు. రేవంత్ రెడ్డి సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ గందరగోళ పరిస్థితుల్లోనే అతి కష్టం మీద కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన సభాస్థలికి చేరుకున్నారు. సభాస్థలి పైకి ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకులను సైతం అనుమతించక పోవడంతో అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సిద్దిపేటలో పాదయాత్ర సందర్భంగా తలెత్తిన గందరగోళం, భద్రతా లోపాలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, జనసందోహాన్ని అదుపు చేయలేకపోవడంతో భద్రత లోపాలపై తన సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానిక పోలీస్ అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

