epaper
Friday, January 16, 2026
spot_img
epaper

క్వాలిటీ ఎడ్యుకేష‌న్, ఫుడ్, స్కిల్ పైన దృష్టి : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : క్వాలిటీ ఎడ్యుకేష‌న్, ఫుడ్, స్కిల్ పైన తమ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం శిల్పా క‌ళా వేదిక‌లో గ్రూప్ 3 ఉద్యోగులను నియామ పత్రాలు అందజేసిన అనంతరం సీఎం మాట్లాడారు. విద్యార్థులు ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారని కొనియాడారు. తెలంగాణ యువత గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసింది. ఇతరుల ఉద్యోగాలు తొలగితేనే తమకు ఉద్యోగాలు వస్తాయన్న భావనతో నిరుద్యోగ యువత నడుం బిగించిందని, అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీలో నెలకొన్న దారుణ పరిస్థితులు అందరికీ తెలిసినవేనని, గత 14 ఏళ్లుగా గ్రూప్–1 నియామకాలు చేపట్టకపోవడం అత్యంత ఘోరమని విమర్శించారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని గత ప్రభుత్వం ప్రశ్నాపత్రాలను బఠానీల మాదిరిగా అమ్మినా వారికి చీమకుట్టినట్టైనా లేదని ఆరోపించారు. టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి, యూపీఎస్సీని అధ్యయనం చేసి కొత్త విధానాలతో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్‌ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచర్‌లను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని విమర్శించారు.

తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నవారినే ప్రస్తుతం టీజీపీఎస్సీ సభ్యులుగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింని తెలిపారు. టీచర్లు, గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వొద్దని కుట్రలు జరిగినా కోర్టుల్లో పోరాడి నియామకాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. రెండేళ్లలో దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలు భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగమని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులను భాగస్వాములను చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం 25 ప్రభుత్వ శాఖల్లో 1370 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు.

విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం 16 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది చదువుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ఎందుకు విశ్వాసం తగ్గుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

స్కిల్ లోపం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతున్నామని.. విద్యలో స్కిల్ అత్యంత కీలకమని, స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్య ఒక్కటే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువస్తుందని పునరుద్ఘాటించారు. ప్రభుత్వానికి వారధులు, సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>