కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. క్యూర్ పరిధిలో విపరీతమైన రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగించే ప్రదేశాల నుంచి మెట్రో, బస్ స్టేషన్లతో అనుసంధానం ఉండేలా ఈ వ్యవస్థ డిజైన్ చేయాలన్నారు. క్యూర్ పరిధిలోని ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు.
ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రాజెక్టులను పరిశీలించాలని సీఎం రేవంత్ సూచించారు. రీ సైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేలా పనులు చేపట్టాలన్నారు.
ఏడాదిలో ఫ్లై ఓవర్ నిర్మాణం..
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేతో రాకపోకలు మరింత మెరుగ్గా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పార్క్ చుట్టూ ఉన్న కాలనీలు, రహదారులపై కీలక సూచనలు చేశారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ముంబయి వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఫ్లై ఓవర్ పనులు సంవత్సరంలోనే పూర్తవుతున్నాయని.. అక్కడ అమలు చేస్తున్న టెక్నాలజీ, పనుల తీరుని అధ్యయనం చేయాలన్నారు. హైదరాబాద్ టు ముంబయి బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్ల నిర్మాణాలపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. శంకర్‌పల్లి టు చేవెళ్ల మధ్య ఇప్పుడు ఉన్న రహదారుల విస్తరణతో పాటు కొత్త నిర్మాణాలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు.

