కలం, వెబ్ డెస్క్: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్య (Chukka Ramaiah) 101వ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య చేసిన సేవలను కొనియాడారు. గొప్ప విద్యావేత్తగా, సామాజిక పరివర్తన తీసుకువచ్చిన చుక్కా రామయ్య వందేళ్లు పూర్తి చేసుకోవడం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలి సభ్యుడిగా తనదైన ముద్ర వేశారన్నారు.
ఎమ్మెల్సీగా చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో పనిచేయడం గొప్ప విషయంగా భావిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సామాజిక సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై పదునైన ప్రశ్నల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి, పరిష్కారం ఏ విధంగా ఉండాలో తనకు సూచించేవారని ఆయన (Revanth Reddy) గుర్తు చేసుకున్నారు. సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటి పరిష్కార మార్గాలు చెప్పేవారిలో చుక్కా రామయ్య ఒకరు అని చెప్పారు.
పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, చుక్కా రామయ్య వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారని తెలిపారు. కాలం, రాజకీయాలకు వీరు అతీతులు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చుక్కా రామయ్య సమకాలీకులు తెలంగాణ లేరు అని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చుక్కా రామయ్య ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆయన మరింత ఆరోగ్యంతో ఉండి అందరికీ స్ఫూర్తి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
Also Read : మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ : సీఎం రేవంత్
Follow Us On: Youtube

