కలం, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని, పనుల్లో ఆలస్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. వాటర్ మేనేజ్‌మెంట్‌లో సాగునీటి సంఘాల భాగస్వామ్యం పెంచాలని, అలాగే ప్రజలను కూడా నీటి నిర్వహణలో భాగస్వాములుగా చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరుల సమర్థ వినియోగం ద్వారా వ్యవసాయానికి స్థిరమైన మద్దతు అందించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

