కలం, వెబ్ డెస్క్: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” ఇవ్వాలని మహానాడులో ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేడుకలో తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ 103వ జయంతి (NTR Jayanti)ని పురస్కరించుకుని మహానాడులో ఆయనకు నివాళి అర్పించే తీర్మానంపై సీఎం ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని మహానాడులో ప్రతిపాదించారు. ఈ సమావేశానికి 1,875 క్లస్టర్ల నుంచి టీడీపీ నేతలు, శ్రేణులు భారీగా హాజరయ్యాయి.
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనేది తెలుగువారి ఆకాంక్ష అని చెప్పారు. బడుగు, బలహీణ వర్గాల కోసం రామారావు ఎనలేసి కృషి చేశారని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని. ఎన్టీఆర్ జయంతి తెలుగువారందరికీ పండుగ రోజు అని అన్నారు. ఎన్టీఆర్ అంటే పేదలకు భరోసా, రైతుకు నేస్తమని.. అన్నివర్గాలు ప్రేమించే నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. సాధారణ ఉద్యోగిగా మొదలై, సినిమా రంగంలో లెజెండరీ స్టార్ గా ఎదిగి, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఎదగడం ఎన్టీఆర్‌కే సాధ్యమని కీర్తించారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎన్టీఆర్ ఎప్పుడూ వీడలేదని.. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనేదే ఎన్టీఆర్ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర..
ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు. ఎన్టీఆర్ సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ జీవితంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు అందరికి ఆదర్శమని అన్నారు. ఎన్టీఆర్ మళ్లీ పుడితే తప్ప ఆయన క్రమశిక్షణ, ఆయన ఖ్యాతి మరెవరికీ సాధ్యం కాదని కొనియాడారు. ఆయన ఎక్కడ ఉన్నా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే జీవించారని చెప్పారు.
ఎన్టీఆర్ లాంటి నాయకుడు మరొకరు లేరు..
రైతుబిడ్డ నుంచి సినిమాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల వరకూ నటించి మెప్పించారని గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ పేరు తలుచుకుంటేనే పట్టుదల, ఆత్మవిశ్వాసం వస్తుందన్నారు. ఆయన పేరు తలచుకుని సంకల్పం చేస్తే చాలు దానికి తిరుగు ఉండదని సీఎం చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాల్లో ఆయన లాంటి నాయకుడు మరొకరు లేరని.. ఆయన మొదట సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగంలో చేరారని గుర్తు చేశారు. నీతి, నిజాయితీతో ఆయన సినిమాల్లోకి వచ్చారని.. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు.

