వీధి నుంచే మొదలైన రాజస్థాన్ చెస్ సంచలనం!

కలం, స్పోర్ట్స్ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన చంద్రజీత్ సింగ్ రాజావత్ (Chandrajeet Singh Rajawat) చెస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న ఆయన.. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. చంద్రజీత్ చిన్నతనంలో జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడేవారు. ఆ తర్వాత ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో నింటెండో గేమ్ ద్వారా చెస్‌పై ఆసక్తి పెంచుకున్నారు. సొంతంగా ఆట నేర్చుకుని తొలిసారి తండ్రితో ఆడినప్పుడు ఆయనను ఓడించారు. 2011-12లో మొదటిసారి చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని.. ఆ తర్వాత ఈ ఆటపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.

తక్కువ సమయంలోనే మంచి నైపుణ్యం సాధించి ఉదయ్‌పూర్‌లోని ఉత్తమ క్రీడాకారులలో ఒకరిగా ఎదిగారు. అయితే చెస్ వల్ల చదువు దెబ్బతింటుందని భావించిన తల్లిదండ్రులు ఆటను మానేయాలని సూచించారు. దీంతో చంద్రజీత్ (Chandrajeet Singh Rajawat) రహస్యంగా టోర్నమెంట్లలో పాల్గొనేవారు. పోటీలలో గెలిచిన తర్వాత పత్రికల్లో ఫొటోలు రావడంతో ఇంట్లో తల్లిదండ్రుల నుంచి మందలింపులు ఎదుర్కొనేవారు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించినప్పటికీ కుటుంబ సభ్యుల కోరికకు విరుద్ధంగా కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. చెస్‌నే తన కెరీర్‌గా ఎంచుకుని ఇల్లు వదిలి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రారంభ రోజులలో  టోర్నమెంట్లకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డబ్బులు లేక రైల్వే ప్లాట్‌ఫామ్‌లు, క్రీడా మైదానాలలో  రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయి.

ఒకసారి ప్రయాణంలో ఫోన్ పోయినా ఆయన వెనక్కి తగ్గలేదు. మరో టోర్నమెంట్‌కు ఆలస్యంగా చేరుకుని సమయం తక్కువగా ఉన్నప్పటికీ అనుభవజ్ఞుడైన క్రీడాకారుడిపై విజయం సాధించారు. ఆ గెలుపు తన జీవితాన్ని మలుపు తిప్పిందని చంద్రజీత్ చెబుతారు. ఆ తర్వాత రాజస్థాన్ తొలి ‘అరేనా గ్రాండ్‌మాస్టర్’ టైటిల్‌ను సాధించారు. గుకేష్, ప్రజ్ఞానంద, నిహాల్ సరిన్ వంటి దిగ్గజ యువ క్రీడాకారులతోనూ పోటీపడ్డారు.

ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటూనే జీవనం కోసం చెస్ కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ది బ్రిటీష్ స్కూల్‌లో చెస్ శిక్షకుడిగా కూడా పనిచేశారు. 2019లో ఉదయ్‌పూర్‌కు తిరిగి వచ్చిన చంద్రజీత్ ‘కింగ్‌డమ్ ఆఫ్ చెస్’ అకాడమీని ప్రారంభించారు. ఆయన శిక్షణలో విద్యార్థులు కామన్వెల్త్, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించారు. ప్రస్తుతం ఆయన అకాడమీ దాదాపు 30 దేశాలలో  విస్తరించి, పలువురికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వదులుకోకుండా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని చంద్రజీత్ ప్రయాణం నిరూపిస్తోంది.

Also Read : గులాబీ గూటిలో అంతర్మథనం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైలెంట్ మోడ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>