కలం, చండూరు: పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు మరువలేనివని చండూరు (Chandur) మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు (Kodi Srinivasulu) అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, బెల్లం, కొబ్బరి నూనె పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి శ్రమ వల్లనే ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీ అభివృద్ధిలో అంతర్భాగమని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.
భవిష్యత్తులో కూడా పారిశుద్ధ్య సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ ఎండ, వాన, చలి వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం కార్మికులు మున్సిపల్ చైర్మన్ కు, కమిషనర్ కు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ సలీమా షరీఫ్, వార్డ్ ఆఫీసర్లు శ్రీరాములు, జగన్, సాయిరాం, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్లు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

